Home  »  Featured Articles  »  ఆ రోజుల్లో ఎన్టీఆర్ దినచర్య.. 30 ఏళ్ళ పాటు ఒకే రకమైన జీవితం.!

Updated : Jul 20, 2026

నటసార్వభౌమ నందమూరి తారక రామారావు నట ప్రస్థానం గురించి అందరికీ తెలుసు. కానీ ఆయన రోజువారీ జీవితం ఎంత క్రమశిక్షణతో కూడి ఉండేదో తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. అంతులేని శ్రమ, కఠినమైన క్రమశిక్షణ.. ఆయన నమ్మిన సిద్ధాంతాలు. అవే ఆయనను ఎవరికీ అందనంత ఎత్తులో నిలబెట్టాయి.

ఎన్టీఆర్ అప్పట్లో మద్రాస్ త్యాగరాయ నగర్ లోని, బజుల్లా రోడ్ లో ఉన్న లక్ష్మీ నిలయంలో ఉండేవారు. ప్రతిరోజూ తెల్లవారుజామునే ఆ ఇంటి దగ్గర సందడి వాతావరణం ఉండేది. ఎన్టీఆర్ తెల్లవారుజామున మూడు గంటలకు నిద్రలేచి.. ఆరు బయట కాసేపు నడుస్తూ చల్లగాలిని ఆస్వాదించేవారు. అలాగే, కాసేపు ఎక్సర్‌సైజ్ చేయడం ఎన్టీఆర్ దినచర్యలో భాగం. సరిగ్గా మూడున్నరకు మసాజ్ చేయడానికి వాహిని స్టూడియోస్ నుంచి ఒక వ్యక్తి వచ్చేవాడు. అప్పటికే గోచి కట్టుకొని రెడీగా ఉన్న ఎన్టీఆర్ కు.. ఒంటినిండా ఆయిల్ రాసి, అరగంట పాటు మసాజ్ చేసేవాడు ఆ వ్యక్తి. 

ఆ తర్వాత స్నానం, పూజా కార్యక్రమాలు ముగించుకుని.. తెల్లని పంచె కట్టుకుని ఆఫీస్ గదిలో కూర్చునేవారు ఎన్టీఆర్. తన బ్యానర్‌లో తెరకెక్కే సినిమాల స్క్రిప్ట్ ల గురించి రచయితలతో చర్చలు జరిపేవారు. సరిగ్గా 5 గంటలకు భోజనం పూర్తి చేసి మేకప్ కోసం సిద్ధమయ్యేవారు. మేకప్ వేసుకునే ముందు భగవంతుడిని స్మరించుకోవడం ఆయనకు అత్యంత ఇష్టమైన పని. అలాగే మేకప్ మ్యాన్ చేత మొదట బొట్టు పెట్టించుకునేవారు. ఐదున్నర లోపు మేకప్ పూర్తయ్యేది. పౌరాణిక చిత్రమైతే మేకప్ కాస్త ఆలస్యమయ్యేది. ఐదున్నరకు కాస్ట్యూమర్ సిద్ధం చేసిన డ్రెస్ వేసుకొని, హాల్ లో కూర్చునేవారు. ఇక అప్పటినుంచి నిర్మాతల రాక మొదలయ్యేది. వారితో మాట్లాడుతున్న సమయంలో.. ఇంట్లో నుంచి అందరికీ టీలు వచ్చేవి. 

ఉదయం ఆరున్నరకు బజుల్లా రోడ్ టూరిస్ట్ బస్సులతో సందడిగా మారేది. అన్నగారి దర్శనం కోసం తిరుపతి నుండి నేరుగా మద్రాస్ లోని ఎన్టీఆర్ ఇంటికి అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చేవారు. ఎన్టీఆర్ ప్రతిరోజూ ఉదయం 7 గంటలకు అభిమానులను కలిసేవారు. కనీసం ఐదు బస్సులు వస్తే తప్ప ఆయన బయటకు వచ్చేవారు కాదు. అభిమానులను పలకరిస్తూ "ఏం బ్రదర్.. ఏ ఊరి నుంచి వచ్చారు? బాగున్నారా?" అని ఆత్మీయంగా అడిగేవారు. ఆ పలకరింపుతో అభిమానులు పులకరించిపోయేవారు. సాక్షాత్తూ ఆ దేవుడి దర్శనమే అయినంత ఆనందంతో తిరుగు పయనమయ్యేవారు. 

ఆ తర్వాత ఎన్టీఆర్ కోసం డ్రైవర్ కారు సిద్ధం చేసేవాడు. భూతాల రాజు అనే వ్యక్తి.. గుమ్మడికాయ మీద హారతి వెలిగించి, దిష్టి తీసిన తర్వాతే.. ఎన్టీఆర్ కారు ఎక్కేవారు. షూటింగ్ స్పాట్ కు కారు చేరేలోపు చిన్న కునుకు తీసేవారు ఎన్టీఆర్. 

హీరోలకు ప్రత్యేక కుర్చీ, పర్సనల్ అసిస్టెంట్ అనే సాంప్రదాయం ఎన్టీఆర్ తోనే మొదలైంది. ఆయన వెళ్ళడానికి ముందే అక్కడ కుర్చీ రెడీగా ఉండేది. అసిస్టెంట్ కుర్చీ మీద ఒక టర్కీ టవల్ వేసేవాడు. అంతేకాదు, ఆ కుర్చీ క్లాత్ మీద ఎన్టీఆర్ అనే పేరు ఎంతో అందంగా డిజైన్ చేసి ఉండేది. 

ఆ కుర్చీ సెట్‌లోకి వచ్చిందంటే, ఎన్టీఆర్ వచ్చారని సంకేతం. దాంతో అందరూ అలర్ట్ అయ్యేవారు. ఎన్టీఆర్ సెట్ కి రాగానే.. నిర్మాతకు, దర్శకుడికి నమస్కరించి ఆ తర్వాత పనిలో నిమగ్నమయ్యేవారు. సరిగ్గా 8 గంటలకే మొదటి షాట్ షూట్ చేసేవారు. 12:55 కి లంచ్ బ్రేక్ తీసుకునేవారు. ఒకవేళ స్టూడియోలో షూటింగ్ ఉంటే.. ఇంటికి వెళ్లి, భోజనం తర్వాత అరగంట విశ్రాంతి తీసుకొని.. సరిగ్గా రెండు గంటలకు మళ్ళీ సెట్ లో ఉండేవారు. టైం విషయంలో ఆయన ఎప్పుడూ పర్ఫెక్ట్ గా ఉండేవారు. 

సెట్‌లో ఇతరులతో ముచ్చట్ల పెడుతూ సమయం వృధా చేయడం అనేది ఆయన డిక్షనరీలో లేదు. అలాగే, దర్శకుడు ఎవరైనా, ఎంత చిన్నవారైనా సరే.. ఎన్టీఆర్ ఎంతో గౌరవం ఇచ్చేవారు. దర్శకుడి పనిలో ఆయన ఎప్పుడూ జోక్యం చేసుకునేవారు కాదు. ఒకవేళ ఏదైనా సూచన చేయాలనిపిస్తే, దర్శకుడిని పక్కకు పిలిచి చెప్పేవారు.

సాయంత్రం వేళల్లో షూటింగ్ స్పాట్‌లో పకోడీలు, మిరపకాయ బజ్జీలు తినడం ఆయనకు ఇష్టంగా ఉండేది. అలాగే తాపేశ్వరం కాజాలు, మినప సున్నుండలు, జున్ను అంటే అమితమైన ఇష్టం. సాయంత్రం షూటింగ్ పూర్తయ్యి, ఇంటికి వెళ్ళిన తర్వాత.. తనని కలవడానికి వచ్చిన నిర్మాతలతో కాసేపు మాట్లాడేవారు. రాత్రి 8 గంటలకు భోజనం ముగించి, 9 గంటలకు నిద్రపోయేవారు. 

దాదాపు 30 ఏళ్ల పాటు ఎన్టీఆర్ ఈ దినచర్యను క్రమం తప్పకుండా పాటించారు. అందుకే ఆయన కేవలం ఒక నటుడిగానే కాకుండా, ఎంతోమందికి ఆదర్శవంతమైన వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయారు.

 

 

Sr NTR, Daily Routine, Life Style, TeluguOne

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.